అమరావతికి వస్తామంటున్న ఏపీపీఎస్సీ!... కాస్త ఆగండంటున్న సీఎస్!
ఏపీ పాలన అంతా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి తరలిరావాల్సిందేనని గత నెలలో చంద్రబాబు ప్రభుత్వం హడావిడి చేసింది. కనీస మౌలిక వసతులు లేకుండా ఎలా వస్తామన్న ఉద్యోగులపై సీఎం నారా చంద్రబాబునాయుడు సహా పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయమూ మనకు తెలిసిందే. అయితే వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనులను పరిశీలించిన ఉద్యోగులు అమరావతికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా శాఖలు అక్కడికి తరలివెళ్లాయి. వసతుల కల్పన తర్వాత కానీ బయలుదేరలేమని చెప్పిన ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం... మేమొస్తామంటూ ముందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి మాత్రం అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం.
అమరావతికి తరలివస్తామంటూ స్వయంగా ఏపీపీఎస్సీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాసింది. అయితే ఈ లేఖపై సీఎస్ ఎస్పీ టక్కర్ నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నట్లు సమాచారం. సదరు కార్యాలయానికి నిరుద్యోగులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నందున ప్రత్యేక భవంతి చూపించాలన్న ఏపీపీఎస్సీ అభ్యర్థనను పరిశీలించిన సీఎస్... ఇప్పుడు కాదు రెండో విడతలో భవనం చూపిస్తామని, అప్పటిదాకా కాస్తంత ఓపిక పట్టాలని చెప్పారట. ఇష్టం లేని ఉద్యోగులను బలవంతాన తరలించిన ప్రభుత్వం... తమకు తాముగా వస్తామన్న ఉద్యోగుల తరలింపుపై దృష్టి సారించకపోవడం గమనార్హం.